telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్రికెట్ కు వీడ్కోలు చెప్పేసిన.. ఇర్ఫాన్ పఠాన్ …

irfan patan good bye to cricket

భారత ఫాస్ట్ బౌలర్, లెఫ్టార్మ్ పేసర్, ఆల్ రౌండర్ అయిన ఇర్ఫాన్.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం ప్రకటించాడు. ఇర్ఫాన్ చివరిసారి గతేడాది ఫిబ్రవరి 27న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన పఠాన్.. బ్యాటింగ్‌లో పది పరుగులు మాత్రమే చేశాడు. భారత జెర్సీని చివరిసారి 2012లో ధరించాడు. 9 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో పఠాన్ బంతితో ఎన్నో అద్వితీయ విజయాలు అందించాడు. ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోవడంతో సొంత రాష్ట్ర జట్టు బరోడాకు మెంటార్ కమ్ ప్లేయర్‌గా పనిచేశాడు. ఇర్ఫాన్ మొత్తం 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 301 వికెట్లు నేల కూల్చాడు. ఏడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. రెండుసార్లు పది వికెట్ల చొప్పున పడగొట్టాడు. 40 టెస్టు ఇన్నింగ్స్‌లలో 31.57 సగటుతో 1105 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. వన్డేల్లో 1544 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలున్నాయి.

ఇర్ఫాన్ తన కెరీర్‌లో వన్డే ప్రపంచకప్ ఆడలేదు. కానీ 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. పాకిస్థాన్‌తో జరిగిన పైనల్‌లో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫవత్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లను ఇర్ఫాన్ నేలకూల్చాడు. 2006లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతడి కెరీర్‌లో ఒక మరుపురాని ఘటన. టెస్టు మ్యాచ్ ప్రారంభ ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా ఇర్ఫాన్ రికార్డులకెక్కాడు.

Related posts