telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నేడే ఐపీఎల్ ఫైనల్ పోరు…

కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతూ గత 52 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌  ఫైనల్‌ స్టేజ్‌కు చేరింది. ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ అమీతుమీకి సిద్ధమైంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదో టైటిల్‌పై గురి పెట్టగా.. లీగ్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ అదే జోష్‌లో టైటిల్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. క్వాలిఫయర్‌-1లో ముంబై చేతితో చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ.. ఈసారి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో రోహిత్‌ సేన పది నెగ్గింది. మరోవైపు యువ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఢిల్లీ ఆడిన 16 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు ఇజయం సాధించింది. 

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబై జట్టులో ఆశించిన స్థాయిలో రాణించక పోయినా.. డికాక్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ..  జట్టుకు భరోసా ఇస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ .. సిక్స్‌లు కొట్టడంలో దిట్ట. పొలార్డ్‌ సంగతి చెప్పక్కరలేదు. మొత్తంగా ఢిల్లీ పేసర్లకు వీరు పగలే చుక్కలు చూపించగలరు. లోయరార్డర్‌లో పాండ్యా బ్రదర్స్‌ క్రునాల్‌, హార్దిక్‌ భారీ షాట్లతో స్కోరు బోర్డును రేసు గుర్రంలా పరుగెత్తించగల సమర్థులు. ఇక బౌలింగ్‌ విభాగానికొస్తే ముంబై తురుపుముక్క బుమ్రా.. ప్రత్యర్థులకు సింహ స్వప్నం. ట్రెంట్‌ బౌల్ట్‌ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బకొడుతున్నాడు. అయితే, క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో  గాయం కారణంగా రెండు ఓవర్లు మాత్రమే బౌల్‌ చేశాడు. ఈ ఫైనల్ ఆడుతాడా అనే విషయంలో సందేహాలు ఉన్నాయి.

ఇక టాపార్డర్‌ వరుస వైఫల్యాలు ఢిల్లీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. శిఖర్‌ ధవన్‌ .. ఢిల్లీ బలం, బలహీనతగా మారాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో  విమర్శలు ఎదుర్కొన్న ధవన్‌.. సన్‌రైజర్స్‌తో క్వాలిఫయర్‌-2లో చక్కగా రాణించాడు.  జోడీగా స్టొయినిస్‌ను ఓపెనర్‌గా పంపిన ఢిల్లీ వ్యూహం గత మ్యాచ్‌లో ఫలించినట్టే కనిపిస్తోంది. హెట్‌మయర్‌ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. అయ్యర్‌, పంత్‌ రాణించడం జట్టుకు ఎంతో కీలకం. ఢిల్లీ బౌలర్లు రబాడ, అశ్విన్‌, నోకియా …లీగ్‌ ఆసాంతం మెరుగైన ప్రదర్శనే చేశారు. స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో జట్టుకు కీలకంగా మారాడు. మొత్తమ్మీద ఢిల్లీపై కోచ్‌ పాంటింగ్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సమష్టిగా చెలరేగితే మరో గొప్ప విజయాన్ని అందుకోవడమైతే ఖాయం.

Related posts