“అల.. వైకుంఠపురములో” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. తన తర్వాతి సినిమాని తారక్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ సినిమాకు పెడుతున్న టైటిల్ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎప్పటిలాగే సెంటిమెంట్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తను తర్వాత తీయబోయే సినిమాకు ‘అ’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో `అరవింద సమేత` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో తెరకెక్కనున్న సినిమా కూడా `అరవింద సమేత` తరహాలోనే సీరియస్ కథాంశంతోనే రూపొందబోతోందట. ఎన్టీయార్ కోసం పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో కూడిన కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారట. రాజకీయ నాయకుడి కొడుకు పాత్రలో ఎన్టీయార్ కనిపించబోతున్నాడట. ఈ ఏడాది ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.