telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యలకు తాము కారణం కాదు: ఇంటర్ బోర్డ్

inter board telangana

తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం తాము కాదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది ఫలితాల విడుదలలో జరిగిన పొరపాట్లు, తప్పిదాల వల్ల విద్యార్థులు ఫెయిలయ్యారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. మా తప్పిదం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదని వెల్లడించింది. ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేసిన 25 మంది విద్యార్థుల 53 సమాధాన పత్రాలను వివిధ సబ్జెక్టు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ పునఃపరిశీలన జరపగా ఈ విషయం తేలిందని బోర్డు కార్యదర్శి అశోక్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ఆత్మహత్య చేసుకోగా ముగ్గురు ఆత్మహత్యయత్నం చేశారని.. వీరిలో పదిమంది ఒక సబ్జెక్టులో, 12 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని వివరించింది. ముగ్గురు విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ బలవన్మరణానికి పాల్పడ్డారని బోర్డు తెలిపింది.సమాధాన పత్రాలు దిద్దడంలో ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం, తప్పిదం కారణంగానే విద్యార్థులు మరణించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అశోక్‌ తెలిపారు. ఈ విషయమై నియమించిన ప్రత్యేక కమిటీ తన విశ్లేషణ నివేదికను అందించిందన్నారు. సబ్జెక్టు నిపుణులతో కూడిన ఈ కమిటీ ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల సమాధాన పత్రాలను విశ్లేషించిందని తెలిపారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్లు, లోపాల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఫెయిలయ్యారన్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని, ఫలితాలు వెల్లడైన తర్వాత బయటపడిన లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దామని పేర్కొన్నారు.

Related posts