తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైతం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు.మరోవైపు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ ప్రయత్నించింది. ఇంటర్ పరీక్షా ఫలితాల బాధ్యతలను చేపట్టిన గ్లోబరీనా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.