telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు .. 7 నియోజక వర్గాలు సమస్యాత్మకం..

telangana reservations for panchayat

త్వరలో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోరుపై ఇంటెలిజెన్స్ ఈసీకి సంచలన నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో ఏడు లోక్‌సభ నియోజక వర్గాలలో పోలింగ్‌ రోజు ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలిసింది. 17 పార్లమెంటు స్థానాలలో ఏడింటిలో పోలింగ్‌ రోజు , దానికంటే ముందు రోజు వివిధ రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదాన్ని నిఘా వర్గాలు ఊహిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ వైషమ్యాలు ఎక్కువగా ఉన్న నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, అదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌లలో ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్‌ కూడా ప్రధాన సమస్యాత్మక ప్రాంతంగా ఇంటెలిజెన్స్ పేర్కొనటానికి కారణంగా ఆ ప్రాంతంలో రైతులు ఆందోళన కారణంగా అభ్యర్థులు సంఖ్య దేశంలోనే మొదటి సారిగా 180 మందిని దాటడం, దానిపై బ్యాలెట్‌ తోటే పోలింగ్‌ జరుగాలని అనేక మంది రైతులు పట్టుబడట్టడం, అనేక మంది రైతు అభ్యర్థులకు ఇంకా వారి ఎన్నికల చిహ్నం గురించి తమకు సమాచారం లేదనే ఆందోళన సాగడం తదితర కారణాలతో ఆ నియోజకవర్గం సైతం పోలీసు ఉన్నతాధికారులకు సమస్యాత్మకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నామినేషన్లు, ప్రచార పర్వంలో పేర్కొన దగ్గ అవాంఛనీయ సంఘటనలేవి చోటు చేసుకోలేదు.

మరోవైపు కేంద్రం నుంచి కోరినన్ని బలగాలు కూడా రాష్ట్రానికి కేటాయించబడలేదు. అయినప్పటికీ ఉన్న బలగాలతోటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. దీనిపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు ఘర్షణలు చోటు చేసుకోకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టిని సారించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, అదిలాబాద్‌, భువనగిరి, నల్లగొండలలో కొంత మతపరమైన ఉద్రిక్తతలకు తావుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌, విపక్షాల కార్యకర్తల మధ్య కూడా ఆధిపత్యం కోసం ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏడు నియోజకవర్గాలలో వ్యూహత్మకంగా ఎన్నికల బందోబస్తును నిర్వహించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Related posts