కరోనా కాటుకు అమెరికాలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఇల్లినాయిస్ లో శనివారం నాడు ఓ చిన్న బిడ్డ కొవిడ్-19 సోకి మరణించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. గత సంవత్సరం చైనాలోని వూహాన్ లో వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తరువాత, వ్యాధి బారినపడి మరణించిన తొలి పసిబిడ్డ ఘటన యు ఎస్ లోనే చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడించిన ఇల్లినాయిస్ గవర్నర్ జేఫీ ప్రిట్జకర్, గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన వారిలో ఓ పసిపాప కూడా ఉందని తెలిపారు. ఈ బిడ్డ రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు.
ఈ విషయం తెలిసి తాను వణికిపోయానని, బిడ్డ మరణానికి ఇతర కారణాలు కూడా సహకరించాయా? అన్న కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ప్రిట్జకర్ వెల్లడించారు. ఈ వార్త ఎంత బాధను కలిగిస్తుందో తనకు తెలుసునని, ఇది దేశంలోని ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతుందని అన్నారు.