మొదటి భారత్-బంగ్లా టీ20 మ్యాచ్ లో చతికిలపడ్డ ఆతిధ్య జట్టు రెండో మ్యాచ్ లో పుంజుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిచింది. చాహల్ (2/28), దీపక్ చాహర్ (1/25), వాషింగ్టన్ సుందర్ (1/25)ల బౌలింగ్ ప్రదర్శనతో మొదట బంగ్లాను 153/6కే కట్టడి చేశారు. చేధనలో రెచ్చిపోయిన రోహిత్ (85; 43 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులు) విజృంభించడంతో లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగలిగారు. రాజ్‌కోట్‌లో రోహిత్ ఆటే హైలైట్‌గా నిలిచింది. అద్భుతమైన ప్రదర్శనకు రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కెరీర్‌లో 100వ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఛేదనలో తొలి ఓవర్ నుంచి ధీటుగా ఆడింది భారత్. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన ధావన్.. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్‌తో తుఫాన్ మొదలైంది. అఫిఫ్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో డీప్ మిడ్‌వికెట్లో స్టాండ్స్‌లోకి పడేట్లు బాదిన రోహిత్ (23 బంతుల్లో) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కానీ అదే జోరులో అమినుల్ బౌలింగ్‌లో ఓ పుల్ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. 13వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 125. రాహుల్ (8 నాటౌట్) అండతో శ్రేయస్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ధావన్ (31; 27 బంతుల్లో 4ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (24 నాటౌట్; 13 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) రాణించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మద్ నయీమ్ (36; 31 బంతుల్లో 5ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. చివరిదైన మూడో టీ20 ఆదివారం నాగ్‌పుర్‌లో జరుగుతుంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (1/44) ఒక్కడే నిరాశపరిచినప్పటికీ స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్ బంగ్లాను దెబ్బతీశారు. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి బంగ్లా పతనాన్ని చవిచూశారు. చాహల్ ఒకే ఓవర్లో (13వ) ముష్ఫికర్ (4), సౌమ్య సర్కార్ (30)ను వెనక్కి పంపాడు. 13 ఓవర్లకు స్కోరు 103/4. మహ్మదుల్లా, అఫిఫ్ హుస్సేన్ (6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ అఫిఫ్‌ను ఖలీల్.. మహ్మదుల్లా (30)ను చాహర్ వెనక్కి పంపారు.