telugu navyamedia
రాజకీయ

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్‌..ఓటేసిన ప్ర‌ధాని మోదీ

ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుం‍ది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది.ఈ క్ర‌మంలో ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేతమార్గరెట్‌ ఆల్వా ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు. అయితే ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

80 ఏళ్ల వయసున్న మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకురాలు..రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్‌ రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు. సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి.

పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు ఓటేసేందుకు పోటెత్తారు.

లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటింగ్‌కు గైర్హాజరవాలని నిర్ణయించుకుంది. మార్గరెట్ అల్వాను ఎంపిక చేసేటపుడు తమను సంప్రదించలేదని ఆరోపించింది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.

అయితే ఉభయసభల్లో విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Related posts