telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పదేళ్లలో టాప్-3కి ఇండియా ఎకానమీ..

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదు నుంచి 6వ స్థానానికి జారుకున్నట్లు అన్పిస్తోందని బ్రిటన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్ట్‌ అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో అంటే… 2025 నాటికి మళ్లీ బ్రిటన్‌ ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి ఎగబాకనుందని అభిప్రాయపడింది. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నివేదికలో సీఈబీఆర్‌ అంచనా వేసింది. 2019లో భారత్‌ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ టాప్‌-5 ఎకానమీగా మారింది. కానీ కరోనా సంక్షోభ ప్రభావంతో ఈ ఏడాది మళ్లీ మెట్టు కిందికి జారుకోనుందని రిపోర్టు తెలిపింది. వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ది రేటు 9 శాతానికి పుంజుకోవచ్చు. 2022 లో 7 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. భారత్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందాక సాధరణంగానే జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. 2035 నాటికి 5.8 శాతానికి పరిమితం కావచ్చు. మరో పదేళ్ల పాటు జపాన్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. 2030 లో జపాన్‌ను భారత్‌ వెనక్కి నెట్టనుంది. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని 2027 లో భారత్‌ అధిగమించవచ్చు. కరోనా సంక్షోభానికి ముందే భారత వృద్ధి గతి తప్పింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి మైనస్‌ 23.9శాతానికి క్షీణించింది. అయితే.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించవచ్చని తాజా నివేదికలో సీఈబీఆర్‌ అంచనా వేసింది.

Related posts