india test record with latest test match

టెస్టు చరిత్రలో  టీమిండియా అరుదైన రికార్డు!

117
బెంగళూరు  చిన్నస్వామి స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ లంచ్‌ సమయానికి 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(104 బ్యాటింగ్‌; 91 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్‌(41 బ్యాటింగ్‌; 72 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) లు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు.  కాగా, టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ ఒక మైలురాయిని నమోదు చేసింది. టెస్టు మ్యాచ్‌ ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు ఒక ఆటగాడు సెంచరీ చేసిన ఘనతను టీమిండియా తొలిసారి సాధించింది. 
 
ధావన్‌ 87 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేయడం ద్వారా భారత టెస్టు క్రికెట్ లో గతంలో ఎన్నడూ లేని ఓ రికార్డు నమోదైంది. అంతకుముందు ఒక టెస్టు ఓపెనింగ్‌ డే లంచ్‌ సమయానికి ముందు భారత్‌ తరపున ఒక ఆటగాడు నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 99. 2006లో సెయింట్‌ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన ​మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 99 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ టెస్టు ఓపెనింగ్‌ రోజున లంచ్‌కు ముందు ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోరుగా ఉంది. దాన్ని తాజాగా ధావన్‌ అధిగమించి సెంచరీతో ఆకట్టుకున్నాడు.