దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ అనంతరం రెండేళ్ల కనిష్టనికి కేసుల సంఖ్య చేరింది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ కేసుల సంఖ్య నాలుగువేల దిగువన నమోదైంది. కొత్తగా 3,614 మందికి కరోనా వైరస్ సోకింది . వైరస్ ధాటికి మరో 89 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నుంచి 5,185 మంది బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 18,18,511 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,91,57,486కు పెరిగింది.