భారతజట్టు పాకిస్థాన్‌లో పర్యటించి ఒక సిరీస్ ఆడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది అన్నాడు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ మొత్తం తమ దేశంలోనే జరుగుతోందని.. ఇతర దేశాలకు ఈ పరిణామం మంచి సందేశమని చెప్పాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్థాన్‌లో పర్యటిస్తోందని.. అలాగే టెస్టులు కూడా ఆడనుందని తెలిపాడు. పాకిస్థాన్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉందన్నాడు. భారత్.. పాకిస్థాన్‌కు వచ్చి ఒక సిరీస్ ఆడితే చూడాలని ఉందని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
దాయాది దేశాలు చివరిసారిగా 2012-13 సీజన్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. మహ్మద్ హఫీజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు.. భారత పర్యటనకు వచ్చి వన్డే, టీ20 సిరీస్ ఆడింది. తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమయ్యాయి. కాగా, అప్పటి నుంచి ఐసీసీ టోర్నీల్లోనే ఈ జట్లు పోటీపడతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి కళ్లూ ఆసియా కప్‌పైనే పడ్డాయి. ఈ ఏడాది జరిగే మినీ సంగ్రామానికి పాకిస్థాన్ ఆతిథ్యమివ్సాల్సి ఉంది. అయితే, తటస్థ వేదికపైనే టీమ్‌ఇండియా ఆసియాకప్‌లో ఆడుతుందని, తదుపరి జరగబోయే ఏసీసీ సమావేశంలో తుది వేదిక ఖరారవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.