telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫేస్ రెకగ్నిషన్ తో చైనాలో డిజిటల్ చెత్త బుట్టలు…!!

China

తాజాగా చైనా అధికారులు అక్కడి ప్రజలకు డిజిటల్ చెత్త బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం బీజింగ్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ డిజిటల్ చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. ఇదే కనుక సక్సెస్ అయితే.. చైనా వ్యాప్తంగా ఈ డిజిటల్ చెత్తబుట్టలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ చెత్త బుట్టలకు ఫేస్ రెకగ్నిషన్ సదుపాయం కూడా ఉండటం విశేషం. అంటే.. చెత్త వేయడానికి వెళ్లిన వారి ముఖాన్ని గమనించి డోర్లు ఆటోమాటిక్‌గా తెరుచుకుంటాయన్నమాట. అయితే ముందుగా అక్కడ ఏర్పాటుచేసిన వాలంటీర్ల ద్వారా చెత్తబుట్టల్లో స్థానికులు తమ అకౌంట్‌ను (ముఖాన్ని, ఇతర వివరాలను) రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫేస్ రెకగ్నిషన్ లేని వారు అక్కడున్న బటన్‌ను నొక్కితే డోర్లు తెరుచుకుంటాయి. ఈ డిజిటల్ చెత్త బుట్టలను మొత్తం ఆరు భాగాలుగా విభజించారు. నాలుగు చెత్త బుట్టలకు బులుగు రంగు ఉంటుంది. అంటే.. వీటిలో రీసైకిల్ అయ్యే చెత్తను వెయ్యాలన్నమాట. మరో రెండు చెత్తబుట్టలు ఆకుపచ్చ, బూడిద రంగులో ఉంటాయి. ఏయే వస్తువులు ఏ బుట్టలో వేయాలన్నది బుట్టలపై ముందుగానే రాసి పెట్టారు. అయినప్పటికీ చాలా మంది ఒక దాంట్లో వేయాల్సిన చెత్తను మరొక దాంట్లో వేస్తున్నట్టు వాలంటీర్లు గుర్తించారు. ఫేస్ రెకగ్నిషన్ ద్వారా చెత్త వేసేవారు తప్పుగా వేస్తే.. చెత్తను తీసుకెళ్లేవారు వారికి ఫోన్ లేదా స్వయంగా సంప్రదించి తగు సూచనలు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా చెత్తను వేయడానికి ప్రత్యేకంగా బ్యాగులను కూడా సిబ్బంది పక్కనే ఏర్పాటు చేశారు. ఫోన్‌లోని వీ చాట్‌ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే బాక్స్ డోర్ తెరుచుకుంటుంది. తద్వారా ఈ బ్యాగును పొందవచ్చు. ఆ బ్యాగులో చెత్త మొత్తాన్ని వేసి చెత్తబుట్టలో పడేయాల్సి ఉంటుంది. ఇది మన దేశంలో కూడా వస్తే ఎంత బాగుంటుందో కదా.

Related posts