ఒలింపిక్స్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్‌లపై సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. అందులో సుశీల్ కుమార్ బేస్‌బాల్ బ్యాట్‌తో రాణాపై దాడి చేశాడు. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత మొబైల్‌లో వీడియో కూడా తీయించాడు. దానిని రెజ్లింగ్ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్ రాణా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోవడంతో సుశీల్ పరారయ్యాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాణా స్నేహితులు సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు. సుశీల్ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి మొబైల్స్‌ను పరిశీలించగా దాడికి సంబంధించిన వీడియో బయటపడింది. ఈ హత్య కేసులో సుశీల్ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి ఈ వీడియోనే కారణమైంది. పరారైన సుశీల్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేశారు. ఇక సుశీల్.. ముందుస్తు బెయిల్ తిరస్కరణ.. కోర్టు రిమాండ్.. దర్యాప్తునకు సహకరించకపోవడం వంటి విషయాలు తెలిసినవే.
previous post