ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, అవి ఆయా ప్రభుత్వాల నుంచి వస్తున్న సమస్యలు కావు. ఏపీలో మద్య నియంత్రణను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాలు మూసేసి, సర్కారీ వైన్ షాప్స్ తెరిచారు. బార్లలో మద్యం రేట్లను బీభత్సంగా పెంచేశారు. గవర్నమెంట్ వైన్ షాపులలో మద్యం రేట్లు కూడా పెరిగాయి. అయితే, అక్కడ కొన్ని రకాల మద్యం మాత్రమే లభిస్తోంది. ఈ క్రమంలో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు చాలా తక్కువ. దీంతో కొందరు ఆయా రాష్ట్రాల్లో మద్యం కొనుగోలు చేసి.. అక్రమంగా వాటిని ఏపీలోకి తరలిస్తున్నారు. కొన్ని చోట్ల బెల్ట్‌షాపులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్నూలు, కర్ణాటక సరిహద్దులో ఉండే అనంతపురం జిల్లాల్లో ఈ తరహా అక్రమ మద్య రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది.