telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

బ్యాక్టీరియా ఉనికిని సత్వరం గుర్తించే .. సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన .. ఐఐటీ-గువాహటి పరిశోధకులు ..

IIT-Gowhati scientists found OFET

బ్యాక్టీరియా ఉనికి కనుక్కోడానికి ప్రయోగశాలల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సత్వరం గుర్తించే సరికొత్త పరికరాన్ని ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. చేతితో పట్టుకునేందుకు వీలుగా ఉండటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం బ్యాక్టీరియా సంక్రమణను గుర్తించేందుకు ప్రయోగశాలలపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ సెల్‌ కల్చర్‌, మైక్రోబయాలాజికల్‌ అస్సేస్‌ వంటి విధానాల్లో గుర్తింపు ఆలస్యమవుతోంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘రియల్‌ టైమ్‌ క్యూపీసీఆర్‌’ సాంకేతికతతో బ్యాక్టీరియా సంక్రమణను వేగంగా గుర్తించగలుగుతున్నప్పటికీ.. అందుకు ఖరీదైన ఉపకరణాలు, నిపుణులైన సిబ్బంది అవసరమవుతున్నారు. వాటికి భిన్నంగా తక్కువ వ్యయంతో, వేగంగా, ఎక్కడైనాసరే బ్యాక్టీరియాను గుర్తించే పరికరాన్ని ఐఐటీ-గువాహటి పరిశోధకులు తయారుచేశారు. ‘ఆర్గానిక్‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ ట్రాన్సిస్టర్‌(ఓఎఫ్‌ఈటీ)’ సాంకేతికత ఆధారంగా అది పనిచేస్తుంది.

ఓఎఫ్‌ఈటీ ప్రవాహంలో బ్యాక్టీరియా ఉపరితలంపై ఆవేశం కారణంగా మార్పులు చోటుచేసుకుంటాయని.. ఫలితంగా బ్యాక్టీరియాను నిర్ధారించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్యాక్టీరియా ఉనికిని గుర్తించడమే కాకుండా, అవి గ్రామ్‌ నెగిటివ్‌ బ్యాక్టీరియానో, గ్రామ్‌ పాజిటివ్‌ బ్యాక్టీరియానో స్పష్టంగా తెలియజేయగలగడం తాజా పరికరంలోని మరో ప్రత్యేకత. రక్తంలో చక్కెర నిల్వలను గుర్తించే పరికరం, గర్భ నిర్ధారణ కిట్‌ వంటి ఉపకరణాల తరహాలో దాన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చు. మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో, బయోటెర్రరిజానికి అడ్డుకట్ట వేయడంలో, పర్యావరణ పర్యవేక్షణలో ఈ పరికరం కీలకంగా మారే అవకాశముంది.

Related posts