telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, సెట్ బాధ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పోవటంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని 4400 సీట్లకు 71,207 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారన్నారు. ఒక్కొక్క సీటుకు 80 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

పది రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామని…త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్యను అందించటం కోసమే వైయస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలకు త్వరలోనే సీఎం జగన్ శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గతంలో ట్రిపుల్ ఐటీ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం వల్లే భవనాల నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. ఈ ఏడాది అడ్మిట్ అయ్యే విద్యార్థులకు ఒంగోలు క్యాంపస్‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు..
1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం)
2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా)
3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా)
4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ జిల్లా)
5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా)

ఫలితాలను ఇలా తెలుసుకోండి..
మొదట ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారిక వెబ్‌సైట్ – rgukt.in ని సందర్శించాలి. .
హోమ్‌పేజీలో ‘ RGUKT CET 2021 ‘ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు.. పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలని.
ఆ తర్వాత ఫలితం, ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.

Related posts