టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన నేపథ్యంలో అతడిపై ఓ వీడియోను ఐసీసీ రూపొందించింది. ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కుమార సంగక్కర, మహేళ జయవర్దనె, వసీమ్ అక్రమ్ తదితరులు జంబోతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. అనిల్ కుంబ్లే వల్ల ఒక బ్యాట్స్‌మన్‌గా నిద్రలేని రాత్రులు గడిపాను. అతడు అందరిలాంటి సంప్రదాయ లెగ్ స్పిన్నర్ కాదు. పొడవుగా, బలంగా ఉంటాడు. పరుగెత్తుకుంటూ వచ్చి చాలా ఎత్తు నుంచి బంతి వదులుతాడు. వేగంగా, నేరుగా, కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత తేలిక కాదు. బౌలింగ్‌లో వేగం ఉండటంతో బంతి బాగా బౌన్స్ అవుతుంది. అతడు విసరే లెంగ్తుత్లో పిచ్‌పై పగుళ్లు ఉంటే.. ఇక ఆడటం కష్టం. కుంబ్లే చాలా మంచోడు. ఆటను అంకితభావంతో ఆడతాడు. ప్రపంచ క్రికెట్లో ఓ విజేత’ అని సంగక్కర అన్నారు. ‘అనిల్ కుంబ్లే బలాలేంటో నాకు బాగా తెలుసు. తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రతి బ్యాట్స్‌మన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది’ అని జయవర్దనె పేర్కొన్నారు. ‘ఢిల్లీలో మాపై కుంబ్లే 10 వికెట్లు తీయడం నాకింకా గుర్తుంది. ఆ పదో వికెట్ నేనే. అదేదో నిన్నే జరిగినట్టు నాకు అనిపిస్తుంది. చాలా భిన్నమైన లెగ్ స్పిన్నర్ అతడు’ అని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చారు. కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టారు.
previous post
next post
టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని