అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గ్లౌజులపై బలిదాన్ గుర్తు తీయాల్సిందే అంటూ స్పష్టం చేసింది. ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్ బ్యాడ్జ్’ విషయంలో ధోనీకి అభిమానులు మద్దతు పలకగా.. బీసీసీఐ కూడా ధోనీకి అండగా నిలుస్తూ ఐసీసీకి లేఖ రాసింది. అయితే బీసీసీఐ అభ్యర్ధనను పరిధిలోకి తీసుకున్న ఐసీసీ.. కీపింగ్ గ్లోవ్స్‌పై కొత్తగా వేసుకున్న ‘బలిదాన్’ చిహ్నాన్ని ఇకపై మ్యాచ్‌లకి అనుమతించబోమని ఐసీసీ శుక్రవారం(7 జూన్ 2019) రాత్రి బీసీసీఐకి చెప్పింది.
అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులను ఆటగాళ్ల జెర్సీ, కిట్స్‌పై అనుమతించరని, ధోనీ కోసం ఇప్పుడు అటువంటి నిబంధనలను మార్చలేమని, మొదటి తప్పు కింద ధోనీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదని, గ్లౌస్‌పైన మాత్రం బలిదాన్ గుర్తు తీయాల్సిందే అని వెల్లడించింది. బీసీసీఐ వినతిపై క్రికెట్ కమిటీ ఆపరేషన్స్ టీమ్‌ని సంప్రదించి.. సుదీర్ఘ చర్చల అనంతరం తిరస్కరిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.