telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్స్ నియమాలు తెలిపిన ఐసీసీ…

ICC

ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని ఐసీసీ భావిస్తుందని ప్రచారం జరిగినా.. నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ముందుగా ప్రకటించినా నిబంధనలకే ఐసీసీ కట్టుబడింది. మ్యాచ్ డ్రా లేదా టై అయినా సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఇక రిజర్వ్‌డేను కేటాయించిన ఐసీసీ.. ఆట ఐదో రోజు చివరి గంటలో దీనిపై మ్యాచ్ అఫిషయల్స్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఫలితం తేలలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ డేతో సంబంధం లేకుండా మ్యాచ్‌ను డ్రాగా పరిగణించనున్నారు. అలా కాని పక్షంలో రోజుకు ఎన్ని ఓవర్లు తక్కువయ్యాయో వాటిని రిజర్వ్‌డే రోజున ఆడించనున్నారు. గతంలో కూడా ఇవే నిబంధనలను పేర్కొన్న ఐసీసీ ఇటీవల వాటిని తొలగించడంతో మరిన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ ఎలాంటి మార్పులు చేయని ఐసీసీ కేవలం రిజర్వ్ డే విషయంలో చిన్న మెలిక పెట్టింది. ఈ టైటిల్‌పోరులో గ్రేడ్ 1 డ్యూక్ బాల్స్ వాడనున్నారు. మాములుగా టెస్ట్‌లకు భారత్.. ఎస్‌జీ బంతులు వాడుతుంటే న్యూజిలాండ్ కోకబుర్రాను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఈ మెగా పోరుకు మరో మూడు రూల్స్‌ను కూడాపెట్టింది. షార్ట్ రన్‌పై టీవీ అంపైరే నిర్ణయం తీసుకోనున్నాడు. ఆటోమెటిక్‌గా పరీక్షించి తదుపరి బంతిలోపు తన నిర్ణయాన్నిప్రకటించనున్నాడు. ఇక రివ్యూ తీసుకునే సమయంలో ఫీల్డింగ్ కెప్టెన్ లేదా బ్యాట్స్‌మన్ అంపైర్‌తో ధృవీకరించుకొని సమీక్ష కోరవచ్చు. ఎల్బీ డబ్ల్యూ రివ్యూ విషయంలో అంపైర్స్ కాల్స్ నిబంధనల్లో స్వల్ప మార్పులు జరిగియి.

Related posts