telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐ-ప్యాక్.. వైసీపీ పాలిట ప్యాకప్ టీమ్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల కంటే ఐ-ప్యాక్ అంటే అపార నమ్మకం.

నమ్మితేనే నాశనం అవుతారనే నానుడి వుంది. దేన్నైనా గుడ్డిగా నమ్మడం, అలాగే వ్యతిరేకించడం చేయకూడదు.

అన్నీ ఆలోచించి, మంచీచెడులపై అంచనాకు రావాల్సి వుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీని నడపడానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాలని ఆలోచించారు.

ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీమ్ 2019 ఎన్నికల కోసం పని చేసింది. ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సొంతం చేసుకోడానికి తన పాదయాత్ర కంటే, పీకే టీమ్ కృషే కారణమని జగన్ సైతం నమ్మారు.

వైసీపీకి 2024 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడడానికి 2019లో అపరిమితమైన అధికారం బీజం వేసింది. వైసీపీకి ఎన్నికల్లో పని చేయడానికి పీకే స్థానంలో ఐ-ప్యాక్ వచ్చింది.

పళ్లూడకొట్టడానికి ఏ రాయి అయితేనేం అన్న చందంగా మారింది. వైసీపీ నాయకులపై ఐ-ప్యాక్ పెత్తనం ప్రారంభించింది.

దీంతో నాయకుల్లో విసుగు, ఆగ్రహం మొదలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఏం చేయాలో ఐ-ప్యాక్ టీమ్ నిర్దేశించడం, దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించడంతో వైసీపీ పతనం ప్రారంభమైంది.

రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకుల్ని కూడా ఐ-ప్యాక్ టీమ్ ఆడించడం మొదలు పెట్టింది.

ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు అసలు తమ నియోజకవర్గాల్లో ఐ-ప్యాక్ అడుగే పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు లేకపోలేదు.

అంతిమంగా ఐ-ప్యాక్ టీమ్ నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వడం, వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక మొదలు, పార్టీలో చేరికల్ని కూడా జగన్ చేపట్టారు.

వైసీపీకి పునాది లాంటి కార్యకర్తల్ని, గ్రామ, మండల, నియోజకవర్గాల నాయకుల్ని విస్మరించి, ప్యాకేజీ కోసం పనిచేసే ఐ-ప్యాక్ టీమ్ జగన్కు ముద్దిచ్చింది.

అసలు ఐ-ప్యాక్ టీమ్కు రాజకీయాలు ఏం తెలుసని వాళ్ల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని తమకు జగన్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితి.

షూటు, బూటు, రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే చాలు, వాళ్లకు రాజకీయాలు బాగా తెలుసని జగన్ పిచ్చి భ్రమలో ఉన్నట్టున్నారు.

అందుకే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ అదే టీమ్ను మళ్లీ నియమించుకున్నారంటే, జగన్ను ఏమనుకోవాలి?

ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునేవాళ్లని విజ్ఞులంటారు. 2024 ఎన్నికల్లో ఐ-ప్యాక్ టీమ్, వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీ కేడర్ను విస్మరించి రాజకీయంగా ఘోర పరాజయం పాలయ్యామనే ఆలోచన, ఆవేదన జగన్లో లేదా? అనే అనుమానం కలుగుతోంది.

వైసీపీ పాలిట ఐ-ప్యాక్ టీమ్ అనేది పార్టీని ప్యాకప్ చేసేదంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.

ఇప్పటికైనా జగన్ నమ్ముకోవాల్సింది పార్టీ నాయకులు, కార్యకర్తల్నే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాల గురించి వాళ్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

ప్యాకేజీ కోసం పని టీమ్లు, మెచ్చుకోలు నివేదికలు ఇస్తాయే తప్ప, నిజాలు చెప్తాయని అనుకోవడం అవివేకమే.

తన శ్రేయస్సును కోరుకునేది, కష్టనష్టాల్లో పార్టీని భుజాన మోసేది కార్యకర్తలు, నాయకులే. మానసికంగా దగ్గరయ్యే వాళ్లను వదిలేసి, డబ్బు కోసం మాయ మాటలు చెప్పే ఐ-ప్యాక్ టీమ్ పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే, జగన్ మాటల్లో చెప్పాలంటే, వైసీపీని ఆ దేవుడే కాపాడాలి.

Related posts