telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం అయినా విచారణకు హాజరు కావాల్సిందే… జగన్ కు షాకిచ్చిన కోర్ట్

jagan attending guntur iftar tomorrow

అక్రమాస్తుల సంపాదన కేసు విచారణలో భాగంగా, వ్యక్తిగత మినహాయింపును ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును మాత్రం నవంబరు ఒకటో తేదీకి రిజర్వులో పెట్టారు. ఈ విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా విచారణకు రావాల్సిందేనంటూ స్పష్టంచేసింది. విచారణకు హాజరు మినహాయింపు కుదరదని, ఇందుకు చట్టం అనుమతించదని కోర్టు గుర్తుచేసింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఆయన తరపు న్యాయవాదులు, అలాగే సీబీఐ తరపు లాయర్లు కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, దీంతో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, సీబీఐ తరపు న్యాయవాదులు మాత్రం ఈ వాదనలకు అడ్డు చెప్పారు. జగన్ గతంలో కూడా వ్యక్తి గత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

గతంలో కానీ, ఇప్పుడు కానీ జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, జగన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు రావాలంటే ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని, అలాగే విధి నిర్వహణలో చాలా ఆటంకాలు కలుగుతాయన్నారు. దీంతో జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. దీనికి కొన్ని ఉదాహరణగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయస్థానం ముందుంచారు. దీనిపై సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఇది ఆర్థిక నేరానికి సంబంధించిన కేసని.. ఇలాంటి కేసుల్లో చాలా కఠినంగా వ్యవహరించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగన్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇస్తే.. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నవంబరు ఒకటో తేదీకి రిజర్వ్ చేశారు.

Related posts