telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ ప్లే ఆఫ్ : హైదెరాబాద్ ను .. వెనక్కు నెట్టేసిన దిల్లీ ..

hyderabad lost on delhi in ipl 2019 playoffa

ఐపీఎల్ ప్లే ఆఫ్ లో భాగంగా రసవత్తరంగా సాగిన ఎలిమినేటర్‌లో దిల్లీ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలిచింది. బుధవారం దిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొదట సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. గప్తిల్‌ (36; 19 బంతుల్లో 1×4, 4×6) టాప్‌ స్కోరర్‌. అమిత్‌ మిశ్రా (1/16) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఆరంభంలో పృథ్వీ షా (56; 38 బంతుల్లో 6×4, 2×6), ఆఖర్లో రిషబ్‌ పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6) మెరుపులతో లక్ష్యాన్ని దిల్లీ.. 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

పృథ్వీ షా అదిరే ఆరంభాన్నిచ్చినా.. కష్టాల్లో మెరుపు బ్యాటింగ్‌తో దిల్లీని గెలిపించిన ఘనత రిషబ్‌ పంత్‌దే. దిల్లీ ఛేదన ఆసక్తికరంగా సాగింది. మరో ఓపెనర్‌ ధావన్‌ (17; 16 బంతుల్లో 3×4) సాధికారికంగా ఆడలేకపోయినా.. పృథ్వీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. ఎనిమిదో ఓవర్లో ధావన్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 66. 10 ఓవర్లకు 83/1. ఐతే ఖలీల్‌ అహ్మద్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (8)తో పాటు, జోరు మీదున్న పృథ్వీ షాను ఔట్‌ చేయడంతో హైదరాబాద్‌ పోటీలోకి వచ్చింది. కానీ రిషబ్‌ పంత్‌, మన్రో (14) క్రీజులో ఉండడంతో దిల్లీకి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. 14 ఓవర్లకు స్కోరు 111/3. దిల్లీ గెలవాలంటే 36 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఐతే 15వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మన్రో, అక్షర్‌ పటేల్‌ (0)ను ఔట్‌ చేసి దిల్లీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పైచేయి సాధించిన సందర్భమది. కానీ పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో దిల్లీని గెలుపు దిశగా నడిపించాడు. నబి బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన అతడు.. చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో థంపి వేసిన 18వ ఓవర్లో వరుసగా 4, 6, 4, 6 కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో దిల్లీకి 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఐతే చెమటలు పట్టించి కానీ విజయలక్ష్మి దిల్లీని వరించలేదు.

పంత్‌ క్రీజులోనే ఉండడంతో దిల్లీ విజయానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లు నాటకీయంగా సాగాయి. భువి వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో తొలి బంతికి రూథర్డ్‌ఫర్డ్‌ (9) ఔట్‌ కాగా.. మూడో బంతికి పంత్‌ సిక్స్‌ కొట్టాడు. కానీ ఐదో బంతికి పంత్‌ ఔటయ్యాడు. అతడు ఏడో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. చివరి ఓవర్లో దిల్లీ విజయానికి ఐదు పరుగులే అవసరం. కానీ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ లేరు. క్రీజులో కీమో పాల్‌, మిశ్రా. ఖలీల్‌ తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి ఉత్కంఠ పెరిగింది. బంతి బ్యాటుకు తగలకపోయినా.. మిశ్రా పరుగుందుకున్నాడు. పూర్తి చేశాడు కూడా. కానీ ఖలీల్‌ త్రోకు ఉద్దేశపూర్వకంగా అడ్డుగా వెళ్లినందుకు ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ ఔటయ్యాడు. చివరి రెండు బంతుల్లో దిల్లీ రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ ఖలీల్‌ షార్ట్‌ బంతిని బౌండరీ దాటించి.. దిల్లీని సంతోషంలో ముంచెత్తాడు పాల్‌.

సన్‌రైజర్స్‌ 11 ఓవర్లలో 75/2 స్కోర్ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్‌ సాహా (8) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్‌ గప్తిల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్‌ 54/1తో నిలిచింది. కానీ ఏడో ఓవర్లో గప్తిల్‌ను మిశ్రా ఔట్‌ చేశాక సన్‌రైజర్స్‌ స్కోరు వేగానికి కళ్లెం పడింది. మిశ్రాతో పాటు అక్షర్‌ పటేల్‌ (0/30) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మనీష్‌ పాండే (30; 36 బంతుల్లో 3×4), విలియమ్సన్‌ (28; 27 బంతుల్లో 2×4)లకు పరుగులు చేయడం కష్టమైంది. ఎదుర్కొన్న తొలి 27 బంతుల్లో పాండే 21 పరుగులు చేయగా.. విలియమ్సన్‌ 11 బంతుల్లో ఆరే చేశాడు. ఆ తర్వాత కూడా ఇద్దరు వేగాన్ని అందుకోలేకపోయారు. 14వ ఓవర్లో పాండే ఔటయ్యేటప్పటికి స్కోరు 90 మాత్రమే. 16వ ఓవర్లో జట్టు స్కోరు 111 వద్ద విలియమ్సన్‌ కూడా నిష్క్రమించాడు. అయినా సన్‌రైజర్స్‌ స్కోరు 160 దాటిందంటే అది విజయ్‌ శంకర్‌ (25; 11 బంతుల్లో 2×4, 2×6), మహ్మద్‌ నబి (20; 13 బంతుల్లో 3×4, 1×6)ల చలవే. అక్షర్‌ బౌలింగ్‌లో నబి ఫోర్‌ కొట్టగా.. శంకర్‌ సిక్స్‌ దంచాడు. కీమో పాల్‌ ఓవర్లో చెరో బంతిని బౌండరీ దాటించారు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో శంకర్‌.. 4, 6 కొట్టి నిష్క్రమించాడు. కీమో పాల్‌ (3/32) వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులు రాబట్టింది.

hyderabad lost on delhi in ipl 2019 playoffaరేపటి మ్యాచ్ : దిల్లీ vs చెన్నై మధ్య రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.

Related posts