తెలంగాణలో చాపాకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాదులోని ఓ అపార్ట్ మెంట్ లో 25 మందికి కరోనా పాజిటివ్ గా తేలడం జీహెచ్ఎంసీ అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకే ప్రదేశంలో ఇన్ని కేసులు రావడంతో ఆ అపార్ట్ మెంట్ ను ఏకంగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
మాదన్నపేటలో ఉన్న ఆ అపార్ట్ మెంట్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇటీవల అపార్ట్ మెంట్ లో ఓ వ్యక్తి బర్త్ డే వేడుకలు నిర్వహించగా, ఆ పార్టీకి 25 మంది హాజరైనట్టు గుర్తించారు. వారికి కరోనా నిర్ధారణ కావడంతో అందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ఇప్పటివరకు ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.