telugu navyamedia
రాజకీయ

ప్రయాణంలోనే పండగ గడిచిపోయేనా.. జాతీయ రహదారులు మస్తు బిజీ.. వేల వాహనాలు.. టోల్ ఫి రచ్చ..

huge traffic on national highways and toll free issue

పండగ సందర్భంగా ఊళ్లకు వెళ్తున్న వారికి మధ్యలోనే అడ్డంకులు అన్నట్టుగా జాతీయ రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ పేరుకుపోయింది. వేల వాహనాలు ఈ ట్రాఫిక్ లోనే ఉండిపోయాయి. ఎంతో కష్టపడి సిటీ దాటినా, జాతీయరహదారిపై ఇంకా కదలని వాహనాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఒక్క కీసర టోల్ గేటు వద్ద సుమారు 5 వేలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేటు నుంచి 5 కిలోమీటర్ల వరకూ వాహనాలు ఆగిపోయాయి. టోల్ టాక్స్ ను రద్దు చేస్తున్నామని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, తమకు కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్న టోల్ గేటు సిబ్బంది, ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రతి వాహనంలోని ప్రయాణికులూ టోల్ గేటు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతుండటంతో, చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 15 వేల వాహనాలు గేట్ ను దాటాయి. తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై ఉన్న మిగతా టోల్ గేట్ల వద్ద కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొనివున్నాయి.

అయితే, తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫీజును రద్దు చేసినప్పటికీ టోల్ నిర్వాహకులు పలువురు టోల్ ఫీజును వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. నల్గొండలోని పంతంగితో పాటు కొన్ని ప్రాంతాల్లోని టోల్ నిర్వాహకులతో మాట్లాడారు. వాహనాలను ముందుకు వదలడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పారు. వాహనాలను పోనివ్వాలని ఆదేశించారు.

దీంతో పంతంగితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టోల్ ఫీజును నిర్వాహకులు ఎత్తివేశారు. ప్రభుత్వ చర్యతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా చాలాచోట్ల టోల్ నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను కాదని ఫీజును వసూలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు, ఈ నెల 16న టోల్ ఫీజు వసూలును రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రటించిన సంగతి తెలిసిందే. ప్రజల సౌలభ్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా నిన్న, నేడు, ఈనెల 16న టోల్ ఫీజును రద్దుచేసింది.

Related posts