ఫేస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సొంత అవసరాలకు అమ్ముకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కోవడం, దానిని సంస్థ అధినేత ఒప్పుకోవడం తెలిసిందే. దీనిపై ఎప్పటినుండో నడుస్తున్న కేసుతో, తాజాగా ఆ సంస్థపై భారీ జరిమానా దిశగా తీర్పు ఉండవచ్చని తెలుస్తుంది. మరి ఈ విషయం పై ఆ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను ఫేస్‌బుక్ అమ్ముకుంటోందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అమ్ముకుని సంస్థ లాభపడుతోందన్న ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమానా విధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు ఫేస్‌బుక్‌కు దాదాపు రూ.16 వేల కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించవచ్చునని భావిస్తున్నారు. 2012లో గోప్యతా ఉల్లంఘనకు పాల్పడినందుకు గూగుల్‌పై ఎఫ్‌టీసీ ఇదే మొత్తం జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌పై విధించే జరిమానా అంతకంటే ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందని, ఇకపై అటువంటి పొరపాటు జరగకుండా చూస్తామని ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. పత్రికల ద్వారా క్షమాపణలు కూడా తెలిపారు. అయినా జరిగిన తప్పిదానికి భారీ జరిమానా తప్పేట్టుగాలేదు.