ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులు, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు. వైకుంఠము రెండు లోని 33 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శనివారం నాడు 83,422 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 50,100 మంది తలనీలాలు సమర్పించగా, 4.27 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.
గోగర్భం జలాశయం వరకు సర్వదర్శనం క్యూలైన్ ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుంది. గంటకు 4 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు.
ఇక భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 20 వరకు ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం రద్దు చేశారు .
అంతేకాకుండా రద్దీ విపరీతంగా ఉన్నందున, భక్తులు వారి యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.