telugu navyamedia
ఆరోగ్యం

తల్లికి కరోనా పాజిటివ్ వస్తే బిడ్డకు పాలివ్వచ్చా! .. నిపుణులు సలహాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సోకుతోంది. అయితే మిగిలిన వాళ్లకు ఎలా ఉన్నా.. గర్భవతులు, చిన్న పిల్లల తల్లులకు కరోనా వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది. వీళ్లు తమతో పాటు తమ బిడ్డల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ మంది భయపడే అంశం తమ నుంచి తమ పిల్లలకు ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని. అయితే డాక్టర్లు తల్లి నుంచి కడుపులో ఉన్న బిడ్డకు లేక పుట్టిన బిడ్డలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చా అన్న అనుమానాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళలు తమ పిల్లలకు పాలు పట్టించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నిపుణులు..

కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు.. పిల్లలకు పాలు ఇవ్వడం కొనసాగించవచ్చని WHO తెలిపింది. పాల ద్వారా కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ అని ప్రకటించింది. అయితే పిల్లలకు పాలు పట్టేటప్పుడు తల్లులు పాటించాల్సిన కొన్ని పద్ధతులను సూచిస్తున్నారు వైద్యులు. పిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు వీలైనంత శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి. బిడ్డ చుట్టూ చాలా శుభ్రమైన వాతావరణం ఉంటేనే ఇన్పెక్షన్ల భయం లేకుండా ఉంటుంది. పాలు ఇస్తున్నప్పుడు తల్లి మాస్క్ తప్పక ధరించాలి. వీలుంటే గ్లవ్స్ కూడా ధరించాల్సి ఉంటుంది. దీనివల్ల బిడ్డకు కరోనా సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ. పిల్లలకు మాత్రం మాస్క్ పెట్టకండి. ఇది వారు గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఎన్ ఐసీయూలో ఉన్న పిల్లలకు తల్లి పాలు అందించేందుకు వెళ్తుంటే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. తల్లి బిడ్డను పట్టుకునే ముందు మాత్రమే కాదు.. మధ్య మధ్యలో తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఎప్పుడూ మీ దగ్గర టిష్యూ పేపర్స్, వెట్ వైప్స్ ఉంచుకోవాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు నోటిని కవర్ చేసుకోవడానికి, నోటి చుట్టూ, చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి. వీలైనంత వరకు ఇవి అప్పటికప్పుడు పడేసేవే అయి ఉంటే మంచిది.

అరచేతులతో పాటు పూర్తి చేతులు, ముఖం, వంటివన్నీ శుభ్రం చేసుకోవాలి. బిడ్డను దగ్గరకు తీసుకోకముందే శుభ్రం చేసుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మంచిది. తల్లి ముట్టుకునే వస్తువులు (బిడ్డ ఉయ్యాల, బొమ్మలు, ఇతర వస్తువులు) వంటివన్నీ తరచూ శానిటైజ్ చేస్తూ ఉండాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్ల భయం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల పాల సరఫరా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనన్ని ఎక్కువ సార్లు బ్రెస్ట్ పంప్ సహాయంతో పాలు తీస్తుండడం వల్ల పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పాలు తీసిన తర్వాత పంప్ ని, బిడ్డకు అందించిన తర్వాత పాల బాటిల్ ని వేడి నీటితో స్టెరిలైజ్ చేయాలి. ఒకవేళ తల్లి చాలా అస్వస్థతతో ఉంటే బ్రెస్ట్ పంప్ సాయంతో పాలు తీసి వేరే వ్యక్తులు బిడ్డకు బాటిల్ లేదా స్పూన్ సాయంతో అందించవచ్చు. వీటితో పాటు డాక్టర్లు అందించిన సేఫ్టీ పద్ధతులన్నీ పాటిస్తూ శుభ్రంగా ఉండడం వల్ల బిడ్డకు కరోనా ఇన్ఫెక్షన్ ముప్పు లేకుండా జాగ్రత్త పడవచ్చు.

Related posts