లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. సమయానికి జీతాలు రాకపోవడంతో అద్దె చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తనను యజమాని అద్దె కోసం వేధిస్తున్నాడంటూ కేరళకు చెందిన యువకుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించాడు.
కేరళకు చెందిన టోజో జోస్ 16 నెలలుగా ఆబిడ్స్ తిలక్‌రోడ్‌లో ఉన్న మెట్రో హాస్టల్‌లో ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా జీతం రాలేదని, చేతిలో డబ్బుల్లేకపోయినా అద్దె చెల్లించాలని యజమాని వేధిస్తూన్నాడని వాపోయాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పరువు తీస్తున్నాడని కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆబిడ్స్ డివిజన్ ఏసీపీని ఆదేశించింది.