ఇప్పటివరకు మార్కెటింగ్ ఇల్లు, వస్తువులు తదితర అమ్మకాలలో కనిపించింది. తద్వారా ఆయా మార్కెటింగ్ చేసే వ్యక్తులకు భుక్తి కోసం ఎంతో కొంత నగదు ముడుతుంది. ఇదే తరహా మార్కెటింగ్ ఇప్పుడు సేవవిభాగం లో కూడా కనిపిస్తుంది.. తాజాగా ఓ ఆసుపత్రి అదే తరహా పని ప్రారంభించింది. ఆ ప్రకారం, మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.1,000 గిఫ్ట్‌కార్డు, 10 మందికి 2,000, 15కు 3,000, 25 మందికి 6,000 గిఫ్ట్‌కార్డు ఇస్తామంటూ.. రాజమహేంద్రవరంలోని ‘ఏస్’ ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆఫర్లను ప్రకటించింది.
ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ జరిపి ఆసుపత్రిని మూసివేయించారు. ఆ ఆసుపత్రి వైద్యులు నిఖిల్ నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య వృత్తిని దిగజార్చేలా ఉన్న ఆ ప్రకటన అనైతికమైనందున నోటీసు ఇవ్వనున్నట్లు వైద్య మండలి ఛైర్‌పర్సన్ సాంబశివారెడ్డి వెల్లడించారు.