telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌లోని ప్రాంతాలు- వాటి వెనుక చరిత్ర…

Hyderabad

ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా ” అబిడ్స్ “గా మారిపోయింది.

గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానా కాలక్రమేణా “లంగర్‌ హౌజ్‌” మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో” చెంచల్‌ గూడ”గా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు ” కార్వాన్” అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా ” కవాడిగూడ”గా మారింది.

దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది” దోమలగూడ”గా మారింది.

ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా “ఖైరతాబాద్” గా మారింది.

హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో “బేగం బజారు”గా నిలిచిపోయింది.

ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా ” అఫ్జల్ గంజ్ “గా మారింది.

ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో “హిమాయత్ నగర్” గా స్థిరపడింది.

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో ” హైదర్ గూడ” ఏర్పడింది.

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో “మలక్ పేట “గా మారింది.

తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది “తార్నాక”గా మారింది.

శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ పై నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది “శాలిబండ”గా మారింది.

నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను “హబ్సిగూడ” పిలుస్తున్నారు.

ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి ” మదీనా “అనే పేరు వచ్చింది.

చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో “చిక్కడపల్లి”గా మారిపోయింది.

అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో” అడిక్ మెట్ “గా మారిపోయింది.

నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి “నౌబత్ పహాడ్ “అని పేరొచ్చింది.

గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను “బాగ్‌లింగంపల్లి” అంటున్నారు.

సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ “మీరాలంమండి” మార్కెట్ ఫేమస్!

నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు “బార్కాస్”అని పిలుస్తున్నారు.

తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో “తాడ్‌ బండ్‌”గా మారిపోయింది.

ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం “ఎర్రమంజిల్‌” గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

Related posts