అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలో కర్ణాటక ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడి ఏ-1 స్టీల్ ఫ్యాక్టరీలో దాడులు చేసి, అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కర్ణాటక పరిధిలోని గౌరీబిదనూరు సరిహద్దులో, ఏపీ పరిధిలో మణేసముద్రం వద్ద ఉన్న ఉక్కు కర్మాగారంలో నిన్న ఉదయం నుంచి సోదాలు జరిగాయి.
బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, ఏ-1 స్టీల్ కు సంబంధించిన అన్ని పరిశ్రమల్లో దాడులు జరిపారు. ఇందులో భాగంగానే హిందూపురం వద్ద ఉన్న స్టీల్ పరిశ్రమలో కూడా సోదాలు చేసినట్టు తెలిసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సహకరించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పరిశ్రమలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమతించలేదు.