telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉపసంహరణపై స్పష్టత‌ కోరిన హైకోర్టు..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. హైకొర్టులో మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేపట్టింది. హైకోర్టునుంచి ఎదురైన ప్రశ్నలకు ప్రభుత్వంనుంచి సరైన సమాధానాల్లేకుండా పోయాయి. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు.

తక్షణమే స్పందించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంనుంచి న్యాయమూర్తుల్ని తప్పించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. అమరావతి అభివృద్ధిపైన హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ వైఖరిని అనుమానించింది. హైకోర్టు విచారణలో ప్రభుత్వ డొల్లతనం వెలుగుచూడటం, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెనుకడుగేసిందని తెలుస్తోంది.

రోజువారి విచారణలో హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వంనుంచి సముచిమైన సమాధానాలు లేకపోయాయి. అడ్వొకేట్ జనరల్ ను నిలదీయడంతో అర్థగంట సమయం కోరారు. దీంతో అసెంబ్లీ సెషన్ నడుస్తుండగానే… అర్థాంతరంగా వాయిదా వేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అడ్వొకేట్ జనరల్ ఓ నివేదిక రూపంలో హైకోర్టుకు నివేదించనున్నారు.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానుల విషయంలో వెనుక్కి తగ్గి, బిల్లు ఉపసంహరణపై వివరణ ఇవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

Related posts