telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాధ మిస్సింగ్ కేసు.. హైకోర్టు అడ్వ‌కేట్ శిల్ప అరెస్ట్‌ ..

హైకోర్టు అడ్వకేట్ శిల్పను అరెస్ట్ చేశారు. నర్సింగ్ విద్యార్థి రాధ  మిస్సింగ్‌ కేసు సంబంధించి తెలంగాణలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.

ఇందులో భాగంగానే హైదరాబాద్‌ ఉప్పల్ చిలుకానగర్‌లో హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం శిల్పను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గచ్చిబౌలి కార్యాలయానికి తరలించారు.

మ‌రోవైపు  ఎన్ఐఏ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిపై సోదాలు చేశారని హైకోర్టు అడ్వకేట్ శిల్ప భర్త బండి కిరణ్ అన్నారు. 

మావోయిస్టులో చేరిన  నర్సింగ్ విద్యార్థి రాధ ఎవరో తమకు తెలియదన్నారు. మేము ఆమెను మావోయిస్ట్ పార్టీలోకి పంపినట్లు కేసు నమోదు చేశారని, అయితే మాకు, రాధకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎంఎస్ ఆర్గనైజేషన్‌లో ఎంతో మంది పని చేశారని, ఉద్దేశ పూర్వకంగా తమపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని బండి కిరణ్ పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ కనిపించకపోవడంతో విశాఖలో మిస్సింగ్ కేసు నమోదైంది. రాధను నక్సల్స్‌లోకి చేర్చారని న్యాయవాది శిల్పపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం చిలకానగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. నాలుగు గంటలపాటు సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. అనంతరం లాయర్‌ శిల్పను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లారు.

Related posts