తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. తాడికొండ సీటును ఆశిస్తున్న ఆశావహులు అసమ్మతి నాయకులను కలుస్తుండడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు సీటు ఇవ్వవద్దని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేత జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్‌తో పాటు అసమ్మతి వర్గీయులు బహిరంగంగానే ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తమని కాదని సీటిస్తే శ్రావణ్‌కుమార్‌ను ఓడిస్తామని, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు మద్దతునిస్తున్న ఎంపీ గల్లా జయదేవ్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అసమ్మతి నేతలు జిల్లా అధినాయకత్వం వద్ద చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇటీవల అసమ్మతి నాయకులను విజయవాడ పిలిపించి మంత్రులు హితబోధ చేశారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి పార్టీ క్యాడరంతా కట్టుబడి ఉండాలని సూచించారు. దీనితో కొందరు అసమ్మతి నాయకులు మెత్తబడగా మిగతా వారు తమ అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అధిస్ఠానం ఎమ్మెల్యే శ్రావణ్‌కు సీటిస్తే ఓడిస్తామని బహిరంగ ప్రకటనలు చేయడం, అది వైరల్ కావడం వంటి పరిణామాలు పార్టి అధిస్థానానికి తలనొప్పిగా పరిణమించింది. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా మండలాలు, నియోజక వర్గ స్థాయిలో చర్చనీయాంశం కాగా అధిస్థానం పార్టీలోని అంతర్గత సమస్యను పరిష్కరించకుండా అధినాయకత్వం చోద్యం చూడడం పలు విమర్శలకు తావిస్తోంది.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తన అభ్యర్థిత్వంపై ధీమా వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలో తన కార్యకలాపాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఎలాగైనా సీటు రానివ్వకుండా చేయాలన్న ధ్యేయంతో కొందరు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. సీట్ల కేటాయింపునకు సమయం ఉన్నా ముందుగానే ఇటువంటి అసమ్మతి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎమ్మెల్యే శ్రావణ్‌ను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెడుతున్నారా అనే సందేహాలను మరికొంత మంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సీటు ఇవ్వకపోవడానికి బలమైన కారణాలేవీ లేవని, ఎమ్మెల్యే శ్రావణ్ తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోనందునే కొందరు నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయుల వాదన. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ నియోజకవర్గంలో టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
గత కొంతకాలంగా ఫిరంగిపురం మండలం గొల్లపాలెంకు చెందిన ఒక నాయకుడు తాడికొండ తెలుగుదేశం టిక్కెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికత కోణంలో ఆయన టిక్కెట్ కోరుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు. అసమ్మతి నేతలను కలిసి తనకు మద్దతునివ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సమావేశాలు పెడితే అక్కడ ఆ నాయకుడి వర్గం క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. తాడికొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించి అసమ్మతి వ్యవహారాలకు చెక్ పెట్టాలని, లేకుంటే పార్టీకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.