రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకొనే జిల్లాల్లో వీరు దాక్కొని ఉండొచ్చని భావిస్తున్నారు. జాబువా, అలీరాజ్‌పూర్, ధార్, బార్వాణీ, రత్లామ్, మంద్‌సౌర్, నీముచ్, అగర్-మాల్వా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
వీరు రాష్ట్రంలోకి ఎలా చొరబడ్డారన్న విషయంలో స్పష్టత లేదన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌కు చెందిన ఓ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్ పాయింట్లకు పంపామని జాబువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ తెలిపారు. 2014 బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో నిందితుడైన జహీరుల్ షేక్ అనే ఉగ్రవాదిని గతవారం మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఇండోర్‌లోని ఆజాద్ నగర్ ప్రాంతంలో జహీరుల్ షేక్ ఎన్‌ఐఏకు పట్టుబడ్డాడు.