హైదరాబాద్ వరుస కుండపోత వర్షాలతో హోరెత్తింది. అనేక సంవత్సరాల తర్వాత మూసి నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. కొన్ని వందల కాలనీలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని వేల ఇళ్లలోకి నీరు చేరింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు మరియు కొంతమంది ప్రాణాలను కోల్పోయారు, అనేక కోట్ల రూపాయల నష్టం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో… అతలాకుతలమైన హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తున్నారు. సినీ, వ్యాపార ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యువ హీరో రామ్ పోతినేని సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నాడు. కొద్దిసేపటి క్రితం హీరో రామ్ కేటీఆర్‌ని కలిసి రూ.25 లక్షల చెక్ అందించారు. ఆయన మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ లాంటి పలువురు నటులు, దర్శకులు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
previous post
next post