పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా రాబోతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ సినిమాకు రచన కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను ఇటీవల ‘బాహుబలి’ స్టార్ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, సినిమాలో తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్‌తో కలిసి కనిపించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనున్నది. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేరుపొందిన నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీలి నీలి ఆకాశం’ అనే వీడియో సాంగ్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాట అనూప్ రూబెన్స్ సారథ్యంలో రూపుదిద్దుకుంది. ఈ మధ్య తన వాయిస్‌తో అందరి మతులు పోగొడుతున్న సిధ్ శ్రీరామ్, సునీతతో కలిసి ఈ పాటను ఆలపించారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
previous post