telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్… “చెక్” ప్రీ లుక్ విడుదల చేసిన కొరటాల

Check

క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘చెక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ‘చెక్’ టైటిల్, ప్రీలుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గురువారం ఆవిష్కరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడిన ఖైదీ కథ ఇది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. “నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్ పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్ యేలేటి మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పంథాలోనే ఉంటూ వాణిజ్య అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్‌ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. రకుల్ ఇంతకు ముందు మా సంస్థలో ‘లౌక్యం’ చేసింది. ప్రియా వారియర్‌కి తెలుగులో ఇదే తొలి చిత్రం. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతర విశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు.

Related posts