telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన, అప్రమత్తమైన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎస్ ఆదేశించారు. నీటి పారుదల , విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సోమేష్ కుమార్ ఆదేశించారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌లలో వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో ఈ రెండు జ‌లాశ‌యాలు నిండు కుండలా తొణికిస‌లాడుతున్నాయి. హిమాయ‌త్ సాగ‌ర్‌లోకి 2,570 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది. ఈ జ‌లాశ‌యం గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 1763.50 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1762.40 అడుగులు. ఉస్మాన్ సాగ‌ర్‌లోకి 3,055 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ జ‌లాశ‌యం గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 1790 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1787.35 అడుగులు.

Related posts