తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని…రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపారు. 13 వ తేదీ తెల్లవారుజామున విశాఖ నర్సాపూర్ మధ్య కాకినాడకు దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉందని…దీంతో ఇవాళ, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ రోజు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..కర్నూల్..గుంటూరు.. ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఈరోజు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు తెలంగాణ లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు కోస్తా తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కురిసే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు చేసారు.