telugu navyamedia
వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. నిన్నటి అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రానున్న 12 గంటల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం దగ్గర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

ఏపీలోనూ కొనసాగుతున్న భారీ వానలు..
ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts