వాసన పోవటం, రుచి తగ్గటం, ముక్కు దిబ్బడ, కరోనా బాధితుల్లో ప్రధానంగా జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తున్నా ఎంతోమంది వాసన పోవటం, రుచి తగ్గటం, గొంతు నొప్పి వంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి కనిపించిన నాలుగైదు రోజుల తర్వాత ఇవి మొదలవుతుండటం గమనార్హం. నిజానికి కరోనాలో ముక్కు, గొంతు, చెవి సమస్యలు అంత ప్రమాదకరం, ప్రాణాంతకం కాకపోయినా కలవరం పుట్టిస్తున్నాయనటంలో సందేహం లేదు. వీటి గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం అవసరం. మంచి విషయం ఏంటంటే- వాసన, రుచి తగ్గటం వంటివి తలెత్తిన చాలామందిలో కొవిడ్ ఉద్ధృతంగా మారకపోవటం. ఎంతోమంది 10 రోజుల్లోనే జబ్బు నుంచి కోలుకుంటుండటం విశేషం.
#వాసన_రుచి_తగ్గటం
ఇప్పుడంటే కరోనా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం గానీ ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలోనూ వాసన, రుచి తగ్గటం తెలిసిందే. దీనికి కారణం వైరస్ ప్రభావమే. మన ముక్కు లోపల పైభాగాన వాసనలను పసిగట్టే చోట (ఆల్‌ఫ్యాక్టరీ ఏరియా) ప్రత్యేకమైన నాడులుంటాయి. వీటికి కొన్ని కణాలు సాయం చేస్తుంటాయి. ఇవి సాధారణంగా రెండు వారాల్లో కోలుకుంటాయి. అందుకే చాలామందిలో త్వరగానే ఘ్రాణశక్తి తిరిగి వస్తోంది. అదే నాడులు దెబ్బతింటే ఘ్రాణశక్తి పూర్తిగా పోయేదే. మరి రుచి ఎందుకు తగ్గుతుంది? వాసనలను బట్టే రుచి. ముక్కుకు వాసన తగిలితేనే నాలుక మీది రుచి మొగ్గలు ప్రేరేపితమవుతాయి. వాసన తెలియకపోతే రుచి మొగ్గల పనితీరు మందగిస్తుంది. కొవిడ్‌లో వాసనలను గుర్తించటం చాలా వేగంగా తగ్గిపోతోంది. దీన్ని శరీరం వెంటనే భర్తీ చేసుకోలేకపోవటంతో రుచీ దెబ్బతింటోంది.
#చికిత్స_మాత్రలు_స్ప్రేలు
కొవిడ్-19తో వాసన, రుచి తగ్గినవారికి ప్రత్యేకించి మందుల అవసరమేమీ ఉండకపోవచ్చు
♦ ముక్కులోకి పీల్చుకొనే ఫ్లూటికసోన్, మొమెటసోన్, బూడిసనైడ్ వంటి స్టిరాయిడ్ స్ప్రేలు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని రోజుకు రెండు సార్లు రెండు మోతాదుల చొప్పున ముక్కులోకి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ముక్కు గోడ కణజాలంలో వాపు, ఉబ్బును తగ్గిస్తూ వాసన, రుచి మెరుగు పడటానికి తోడ్పడతాయి.
#పొడి_దగ్గు
కొందరు ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాతా దగ్గుతో బాధపడటం చూస్తున్నాం. నిజానికి దగ్గు ఊపిరితిత్తులతో ముడిపడినదే అయినా గొంతు కణజాలం ఉబ్బినా పొడి దగ్గు రావొచ్చు. దీనికి కారణం వైరస్ నిర్వీర్యమైనా కూడా కొద్దిరోజుల పాటు గొంతు పొరలు అలాగే ఉబ్బిపోయి ఉండటం. దీంతో మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు గాలి వేగంగా వస్తూ పోతుండటం వల్ల దగ్గు వస్తుంది. ఇన్‌ఫెక్షన్ తగ్గిన 3 వారాల వరకు ఇలాంటి దగ్గు కనిపిస్తోంది.
#చికిత్స_స్టిరాయిడ్_మాత్రలు_దగ్గు_మందు
ః దగ్గు తగ్గటానికి నెబ్యులైజర్ ద్వారా స్టిరాయిడ్, బ్రాంకోడైలేటర్ రెస్‌ప్యూల్స్ ఇవ్వటం మేలు చేస్తుంది. స్టిరాయిడ్లు వాపు ప్రక్రియను తగ్గిస్తే, బ్రాంకోలైటర్లు శ్వాసమార్గం విప్పారేలా చేస్తాయి. దగ్గును అదుపులో ఉంచుతాయి. అవసరమైతే డెక్సామెథార్ఫన్ హైడ్రోబ్రొమైడ్‌తో కూడిన సిరప్ ఇవ్వచ్చు. రాత్రిపూట నిద్ర పట్టనీయకుండా దగ్గు వేధిస్తుంటే కొడిన్‌తో కూడిన మందుతో మంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు యాంటీ హిస్టమిన్లు వాడుతుంటారు. ఇవి చికాకు తగ్గించొచ్చు గానీ గొంతు తడారి పోయేలా చేస్తాయి. దీంతో దగ్గు ఎక్కువవుతుందని తెలుసుకోవాలి.
#గొంతు_నొప్పి
గొంతులోకి చేరిన వైరస్ ముందు అక్కడే వృద్ధి చెందుతుంది. దీంతో అక్కడి కణజాలం ఉబ్బుతుంది. ఎరుపెక్కుతుంది (ఎరితీమా). ఫలితంగా గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటివి తలెత్తొచ్చు. ఎక్కువకాలం మాస్కులు పెట్టుకోవటం వల్ల గొంతు తడారిపోతుండటమూ దీనికి కారణం కావొచ్చు. అందువల్ల తరచూ నీరు తాగుతుండటం మంచిది. లేకపోతే గొంతు తడారిపోయి గొంతునొప్పి, చికాకు ఎక్కువకావొచ్చు. కొందరిలో అతి ప్రయోగాలూ వికటిస్తున్నాయి. వైరస్ చనిపోతుందని కొందరు టీ, కాఫీ మాదిరిగా కాలే కాలే వేడి నీళ్లు తాగటం చేస్తున్నారు. ప్రస్తుతం ఘాటుగా ఉండే కషాయాలు తాగటమూ ఎక్కువైంది. ఏదో ఒకట్రెండు సార్లంటే ఏమో అనుకోవచ్చు గానీ అదేపనిగా వీటిని మితిమీరి తాగటం సరికాదు. అతిగా తీసుకుంటే మృదువైన గొంతు కణజాలం దెబ్బతిని, గొంతునొప్పికి దారితీయొచ్చు.
#చికిత్స_ఉపశమనం_ప్రధానం
♦ గొంతునొప్పి మామూలుగా ఉంటే ప్రత్యేకించి మందులేవీ అవసరం లేదు. తరచూ గోరు వెచ్చటి నీటిని తాగితే చాలు. గోరు వెచ్చటి సూప్‌ల వంటివి తీసుకోవచ్చు. అవసరమైతే జ్వరం మాత్రలు వేసుకోవచ్చు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు అనుమానిస్తే యాంటీబయోటిక్ మందులు అవసరమవుతాయి.
♦ గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పొవిడోన్ అయోడిన్ ద్రావణాన్ని నీటిలో కలిపి అయినా పుక్కిలించొచ్చు.
♦ ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు, పండ్ల వంటివి అసలే తీసుకోవద్దు. ఐస్‌క్రీములు తినొద్దు.
#గొంతులో_అడ్డంకి
గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించటం మరో సమస్య (లారింగోఫారింజియల్ రిఫ్లక్స్). జబ్బు తగ్గిన తర్వాత ఇది మొదలవుతుండటం గమనార్హం. దీనికి మూలం జీర్ణాశయంలోని పదార్థాలు పైకి ఎగదన్నుకు రావటం. అందుకే దీన్ని జీర్ణసమస్యగా పొరపడే అవకాశముంది. జీర్ణ సమస్య మాదిరిగా ఇందులో ఛాతీలో మంట వంటివేవీ ఉండవు. గొంతులో ఏదో అడ్డుపడినట్టు, చికాకు పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది. దీంతో తరచూ గొంతు సవరించుకుంటుంటారు.
♦ దీనికి అవసరాన్ని బట్టి దగ్గు మందులు, మ్యూకేన్ జెల్ లాంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది.
#చెవి_నొప్పి
ముక్కు వెనక భాగాన యూస్టేషన్ గొట్టం ఉంటుంది. ఇది మధ్య చెవికి అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా ముక్కులోని వైరస్ మధ్య చెవిలోకి విస్తరించే అవకాశం లేకపోలేదు. ఇది చెవి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. ఫలితంగా నొప్పి మొదలవుతుంది. కొందరిలోనే ఇలాంటి సమస్య తలెత్తుతోంది. కరోనా ఇన్‌ఫెక్షన్ తగ్గితే నొప్పీ తగ్గుతుంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌గా మారితే యాంటీబయోటిక్ మందులు అవసరమవుతాయి.
ఇతర సమస్యలు
♦ కొందరిలో శరీరం తూలిపోవటం చూస్తున్నాం. మన శరీర నియంత్రణ మెదడు, లోపలి చెవిలోని భాగాలు, కీళ్లు, కళ్ల మీద ఆధారపడి ఉంటుంది. చెవి లోపలికి ఇన్‌ఫెక్షన్ వ్యాపించటం వల్ల మెదడు ప్రభావితం కావటం దీనికి కారణం కావొచ్చు. వీరికి ఆయా సమస్యలను విశ్లేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
♦ కొందరిలో టాన్సిల్స్ ఉబ్బటమూ కనిపిస్తోంది. అవసరమైతే దీనికి పారాసిటమాల్ మాత్రలు వాడుకోవచ్చు.
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు