telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా కల్లోలం : ఎలాంటి మాస్కులు వాడితే మంచిది !

masks corona

💠మాస్క్ పెట్టుకుంటే క‌రోనా సోక‌దా?

🔷మాస్క్ ఉంది క‌దా అని ఇష్టారాజ్యంగా తిర‌గ‌కూడ‌దు. మాస్క్ ఉన్నా ఆరడుగుల దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇద్ద‌రికీ మాస్కులు ఉన్నాయి క‌దా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడ‌టం మంచిది కాదు. అంత ద‌గ్గ‌ర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే త‌క్కువ ప‌రిమాణంలో ఉన్న తుంపిర్లు నేరుగా ముక్కు, నోరు ద్వారా వైర‌స్‌ వ్యాపించే అవ‌కాశం ఉంటుంది.

డబల్ మాస్క్ ఎందుకు వాడాలి?

🔷అంద‌రూ క‌చ్చితంగా మాస్కులు వాడాలి. జ‌నాలు గుమిగూడి ఉన్న ప్ర‌దేశాల్లో రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక్క మాస్క్ వాడితే వైర‌స్ వ్యాప్తి రేటు 60 శాతం మాత్ర‌మే త‌గ్గుతుంది. అదే రెండు మాస్కులు వాడితే వైర‌స్ వ్యాప్తిని 80 శాతానికి పైగా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు రెండు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి. అదే ఎన్‌-95 మాస్కుల‌తో 95 శాతం ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. కాబ‌ట్టి ఎన్ 95 మాస్క్ అయితే ఒక్క‌టి వాడినా స‌రిపోతుంది

💠ఎన్‌-95 మాస్కుల్లో ఎలాంటివి వాడాలి?

🔷రెస్పిరేట‌రీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కుల‌ను మాత్ర‌మే వాడాలి. రెస్పిరేట‌రీ వాల్వ్‌లు వాతావ‌ర‌ణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మ‌న‌కు అందిస్తాయి. అదే మ‌నం వ‌దిలిన గాలిని మాత్రం నేరుగా బ‌య‌ట‌కు పంపిచేస్తుంది. ఒక‌వేళ క‌రోనా సోకిన వారు రెస్పిరేట‌రీ వాల్వ్ ఉన్న‌ ఎన్‌-95 మాస్కులు ధ‌రిస్తే వారు వ‌దిలిన గాలి నేరుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. దీంతో ఇత‌రుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుంది.

💠రెండు ఒకే రకం మాస్కులు వాడొచ్చా?

🔷ఎన్‌-95 మాస్కుల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది కాబట్టి వాటిని వాడ‌టం అంద‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు రెండు మాస్కుల విధానాన్ని ఫాలో అవ‌డ‌మే బెట‌ర్‌. అలా అని రెండు స‌ర్జిక‌ల్ మాస్కులు లేదా రెండు బట్ట మాస్కులనే వాడ‌కూడ‌దు.

💠ఒకే ర‌కం మాస్కుల‌ను ఎందుకు వాడ‌కూడ‌దు?

🔷ఒకేర‌క‌మైన రెండు మాస్కులు ధ‌రించ‌డం వ‌ల్ల పొరలు పెరుగుతాయే త‌ప్ప ఎలాంటి అద‌న‌పు ప్రయోజ‌నం ఉండ‌దు. మాస్కు పొర‌లు పెరిగిన‌ప్ప‌టికీ వాటి మ‌ధ్య ఉండే ఖాళీలు అలాగే ఉంటాయి. ఆ ఖాళీల నుంచి ముక్కు, నోటి ద్వారా వైర‌స్ శ‌రీరం లోప‌లికి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది. అదే రెండు విభిన్న ర‌కాల మాస్కులు వాడితే మాస్కు పొర‌ల్లో ఉండే ఖాళీల‌ను పూడ్చిన‌ట్టుగా ఉండ‌ట‌మే కాకుండా.. రెండింటి ఆకృతి వేరేలా ఉంటుంది కాబ‌ట్టి ముఖానికి బిగుతుగా ప‌ట్టేసిన‌ట్టు ఉండి వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌గ‌లుగుతాయి

💠రెండు మాస్కుల్లో ఏది పై నుంచి పెట్టుకోవాలి?

🔷ముందుగా స‌ర్జిక‌ల్ మాస్క్ ధ‌రించి, దాని పై నుంచి బ‌ట్ట మాస్క్ పెట్టుకోవాలి. దీనివ‌ల్ల 85.4 శాతం వ‌ర‌కూ ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. గాలి పీల్చుకోవ‌డంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు.

💠రెండు మాస్కులు లేక‌పోతే ఎలా?

🔷రెండు మాస్కులు లేన‌ప్పుడు ఒక స‌ర్జిక‌ల్ మాస్క్‌ను ధ‌రించ‌వ‌చ్చు. అయితే మాస్కుల‌కు రెండు ప‌క్క‌ల ఉన్న ర‌బ్బ‌ర్ మొద‌టి భాగాన్ని ముడివేసి ఎలాంటి గ్యాప్ లేకుండా చేయాలి. రెండు వైపులా అలా ముడివేయ‌డం వ‌ల్ల ముక్కు, నోటిని క‌ప్పేసిన‌ట్టుగా మాస్క్‌ ఉంటుంది. దీనివ‌ల్ల 77 శాతం వ‌ర‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ముడి వేయ‌కుండా వాడితే 56 శాతం మాత్ర‌మే ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

Related posts