telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం మజ్జిగ తాగుతున్నారా…అయితే ఇవి తెలుసుకోండి !

పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తాగుట వలన కలుగు సమస్య , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.

మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని “గోళ ” అని అంటారు. పెరుగుకు నాలుగోవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని “ఉదశ్విత” అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేయబడిన మజ్జిగని ” తక్రము ” అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని “కాలశేయ” అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .

తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .

వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును . కాని కంఠము నందు కఫాన్ని కలిగించును. గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు తక్రమను మజ్జిగ వాడరాదు. అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .

శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను . పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.

కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్రవృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను . శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును. మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువల్ల విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా పనిచేయును . మేకల మజ్జిగ , గొర్రెల మజ్జిగ , చెడ్డవాసన కలిగిన మజ్జిగ త్రిదోషాలను పెంచును. కావున వాడరాదు.

మనుష్యల రోగాలకు ప్రధానకారణం మనం తీసుకునే ఆహారం . మనయొక్క శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని మనం తీసుకున్నంతవరకు మనకి సమస్య ఉండదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి . ఈ మధ్యకాలంలో నాదగ్గరకు వస్తున్న రోగులలో చాలావరకు ఆహారసంబంధ రోగాల వారు ఎక్కువగా వస్తుండటం గమనించాను. అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక ప్రధాన సూక్తి కలదు. ” త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి ” అని గొప్ప విషయం అంతర్లీనంగా చెప్పబడింది. కావున మీ శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడవద్దు.

Related posts