telugu navyamedia
క్రీడలు వార్తలు

అజారుద్దీన్‌ కు షాక్ ఇచ్చిన హెచ్‌సీఏ‌…

అసోసియేషన్‌ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అజారుద్దీ‌న్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా…అందుకు ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. యూఏఈలో జరిగిన అనధికారిక టీ10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్‌ నియామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌… ఇకపై అసోసియేషన్‌ కార్యకలాపాల్లో అజారుద్దీన్ పాల్గొనరాదని నిషేధం విధించింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ‌లకు సంయుక్తంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ‘హెచ్‌సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు పిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరిపేందుకు జూన్ 10న అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. అజార్‌పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ గుర్తించని టీ10 లీగ్‌లో పాల్గొంటున్న ఈ క్లబ్‌కు అజార్ మెంటార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దమే కాకుండా పరస్పర విరుద్ద ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్దారించింది.హెచ్‌సీఏకు దిల్‌సుక్‌నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలను గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Related posts