కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనుసూద్ సేవలకి గాను తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ స్వయంగా సోనూసూద్ కి ఫోన్ చేసి ప్రశంసించారు. కరోనా లాంటి విపత్కరమైన సమయంలో వలస కార్మికులని సొంత గ్రామాలకి పంపినందుకు గాను అయన కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది కార్మికులను ఇంటికి చేర్చారని కొనియాడారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన సోనుసూద్ .. మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. నా ప్రయత్నాన్ని మీరు మెచ్చుకున్న తీరు నాకు మరింత బలాన్ని ఇచ్చింది. త్వరలో చంఢీఘర్ లేదా కర్నాల్‌కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని సోనూసూద్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. తాజాగా అస్సాం వరదల్లో తన ఇంటిని కోల్పోయిన ఓ మహిళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు సోనూసూద్.
previous post
అమ్మ బయోపిక్ ను ఎవరు తీసినా అది సినిమానే… మేము చేసేది మాత్రం ఆమె జీవితం : నిత్యామీనన్