telugu navyamedia
రాజకీయ

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన హార్దిక్ పటేల్..

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్​ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపారు. 

కాంగ్రెస్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను.. నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్‌ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్‌ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

ఈ ఏడాది నవంబర్​లో గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలినట్లైంది.

గుజరాత్ రాష్ట్రంలో బలంగా ఉన్న పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్.. పార్టీని వీడటం కాంగ్రెస్​కు నష్టమే. హార్దిక్ కొంతకాలంగా పార్టీపై గుర్రుగా ఉన్నారు. పేరుకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు.

అంతేగాక హార్దిక్ పటేల్‌ బీజేపీ లేదా ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు హార్దిక్ పటేల్. రాష్ట్ర నాయకులకు డిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలకు చికెన్ సాండ్​విచ్ సమయానికి అందిందో లేదో చూసుకోవడమే ముఖ్యమని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా పట్టవని ధ్వజమెత్తారు. సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్​గా తీసుకోదని, అదే అతిపెద్ద సమస్య అని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు మన నేతలు విదేశీ పర్యటనలకు వెళ్తారని రాహుల్‌ గాంధీని ఉద్ధేశించి విమర్శించారు. గుజరాత్​, గుజరాతీలు అంటే పడనట్లు కాంగ్రెస్ అధినాయకత్వం మాట్లాడుతుందని, అలాంటప్పుడు రాష్ట్రంలో బీజేపీకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు.

Related posts