telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కృష్ణుడే .. నిర్మించిన ‘హరసిద్ధి మాత’ .. దేవాలయం..

harasiddi maa temple by lord krishna

ఉత్తరాదివారు కొలుచుకునే ఓ ప్రసిద్ధ అమ్మవారు.. ‘హరసిద్ధి మాత’. ఈ అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలవడం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పడం కష్టం. కానీ మహాభారతానికి చెందిన ఓ కథ మాత్రం ఇందుకు కారణంగా వినిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు, జరాసంధుడనే రాజుని సంహరించిన విషయం తెలిసిందే కదా ! ఇలా జరాసంధుని సైన్యం మీదకు యుద్ధానికి వెళ్లే ముందు ఆయన జగజ్జననిని విజయం కోసం ప్రార్థించారట. తరువాత జరిగిన యుద్ధంలో జరాసంధుడు పరాజయం పాలయ్యాడు. ఈ విజయంతో యాదవులంతా కూడా విపరీతమైన హర్షాన్ని పొందారట. అప్పటి నుంచి అమ్మవారిని హర్షత్ మాతగా పిలుచుకోసాగారట. ఇందుకు తార్కాణంగా ఇప్పటికీ ఉత్తరాదిన యాదవులు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తుంటారు. అంతేకాదు స్వయంగా ఆ కృష్ణుడే ద్వారకకు సమీపంలోని కోయలా దుంగార్‌ అనే చోట హరసిద్ధి మాత ఆలయాన్ని నిర్మించారట.

కోయలా దుంగార్‌ కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు దూరదూరాల నుంచీ భక్తులు వచ్చేవారట. అయితే అమ్మవారి చూపుల తీక్షణతకు ఆ సమీపంలో ప్రయాణించే ఓడలన్నీ దగ్థమైపోయేవి. దాంతో అమ్మవారిని కొండ మీద నుంచి తీసుకువచ్చి కింద ప్రతిష్టించాలని ‘జగ్దు షా’ అనే వ్యాపారవేత్త నిశ్చయించుకున్నాడు. జగ్దు షా ప్రార్థనలని మన్నించిన అమ్మవారు కూడా, తాను కింద నిర్మించే ఆలయంలో ఉండేందుకు అభయాన్ని ఒసగారు. అలా 13వ శతాబ్దంలో జగ్దు షా నిర్మించిన ఆలయం ఇప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. హరసిద్ధి మాతను హరసిద్ధి, హర్షత్‌ మాత, వాహనవతి, సింధోయ్‌ మాత వంటి భిన్నమైన పేర్లతో కొలుచుకుంటారు. జీవితంలో సుఖసంతోషాలను అందించే తల్లిగా, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల క్షేమాన్ని చూసుకునే రక్షగా ఆమెను నమ్ముకుంటారు. అందుకే ఉత్తరాదిలో ఎక్కడ చూసినా ఆమె ఆలయాలు కనిపిస్తాయి. వాటిలో ఉజ్జయినిలో విక్రమాదిత్య రాజు నిర్మించిన ఆలయం ప్రముఖమైనది.

Related posts